చెమట చుక్కని చిందిస్తేనే - శ్రీశ్రీ
కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు…
అదీ చేతకాకపోతే, పాకుతూ పో…
అంతేకానీ, ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు!
దేహానికి తప్ప దాహానికి పనికిరాని
ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే…
ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళిపోయారనీ
అలాగే ఉండిపోతే ఎలా?
తలుచుకుంటే,
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది!
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?
సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు…
పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు,
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే
ఆ నెత్తురుతో సహా – ఏదీ ఆగిపోడానికి వీల్లేదు!
లే…! బయలుదేరు…!
నిన్ను కదలనివ్వకుండా చేసిన
ఆ మానసిక బాధల సంకెళ్ళను తెంచేసుకో,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు!
నువ్వు పడుకునే పరుపు,
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్!
నీ అద్దం,
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో!
నీ నీడ,
నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్!
మళ్ళీ చెప్తున్నా…
కన్నీళ్ళు కారిస్తే కాదు,
చెమట చుక్కని చిందిస్తేనే
చరిత్రను రాయగలవని తెలుసుకో…!
No comments:
Post a Comment